బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదల కావడంపై సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి న్యాయవ్యవస్థ ప్రతిష్ట, విశ్వసనీయతకి భంగం కలిగించేవిదంగా మాట్లాడటం సరికాదని సుప్రీంకోర్టు సున్నితంగా మందలించింది.
దీనిపై సిఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, “న్యాయవ్యవస్థపై నాకు అపారమైన గౌరవం, నమ్మకం ఉన్నాయి. ఈ నెల 29న మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు నేను మన న్యాయవ్యవస్థ తీర్పుని తప్పు పడుతున్నట్లుగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడిన్నట్లు నాకు తెలిసింది. అయితే నా మాటలను మీడియా వక్రేకరించడం వలననే ఆవిదంగా జరిగింది. నాకు న్యాయవ్యవస్థపై నాకు అపారమైన నమ్మకం ఉందని మరోసారి తెలియజేస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.
బీజేపీతో బిఆర్ఎస్ పార్టీ ‘డీల్’ కుదుర్చుకున్నందునే కల్వకుంట్ల కవితకి బెయిల్ లభించిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే రాజకీయ పార్టీలు న్యాయవ్యవస్థని మేనేజ్ చేసి అనుకూలంగా తీర్పులు చెప్పించుకుంటున్నాయన్నట్లు ఆ వార్తల సారాంశం. అందుకే సుప్రీంకోర్టు సిఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ రేవంత్ రెడ్డి తాజా వివరణతో ఈ వివాదం ముగిసిన్నట్లే భావించవచ్చు.