జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేతకి రంగం సిద్దం!

హైదరాబాద్‌ శివారులో శంకరపల్లి మండలంలో జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేతకి రంగం సిద్దం అయ్యింది. బిఆర్ఎస్ పార్టీ నేత ప్రదీప్ రెడ్డికి చెందిన ఆ ఫామ్‌హౌస్‌ని కేటీఆర్‌ లీజుకి తీసుకొని దానిలో నివాసం ఉంటున్నారు.

ఇటీవల హైడ్రా సంస్థ చెరువుల బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తూ, జన్వాడ ఫామ్‌హౌస్‌ రికార్డులని కూడా పరిశీలించింది. హైడ్రా సిబ్బంది జన్వాడలో ఫామ్‌హౌస్‌ ఉన్న ప్రాంతానికి వెళ్ళి సర్వే చేశారు కూడా. 

చేవెళ్ళ రెవెన్యూ డివిజన్ అధికారుల తాజా నివేదిక ప్రకారం దానికి ఎటువంటి అనుమతులు లేవు. ఎనిమిదేళ్ళ క్రితం దానిని నిర్మించినప్పుడు గ్రామ కార్యదర్శి నోటీసులు కూడా పంపారు. కానీ దాని యజమాని ప్రసాదరాజు స్పందించలేదు. గ్రామ పంచాయితీకి నిధులు అవసరం కనుక అనుమతుల విషయం పట్టించుకోకుండా దానికి ఇంటి నెంబర్ 4-5 కేటాయించి ఏడాదికి రూ.11,000 పన్ను వసూలు చేస్తున్నారు. 

కనుక జన్వాడ ఫామ్‌హౌస్‌కి ఎటువంటి అనుమతులు లేకపోవడమే కాక బుల్కాపూర్ నాలా పరీవాహక ప్రాంతం (బఫర్ జోన్‌)లో కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనిని ధృవీకరించుకునేందుకు వారు శాటిలైట్ చిత్రాలు తెప్పించుకొని గ్రామ పంచాయితీలో రికార్డులు, మ్యాప్‌లతో పోల్చి ధృవీకరించుకున్నారు.

మరొక్కసారి అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్‌కి ఆ నివేదిక సమర్పిస్తారు. కనుక త్వరలోనే హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫామ్‌హౌస్‌ని కూల్చేయడం ఖాయంగానే భావించవచ్చు.