తర్వాత హెచ్ఎండీఏ అధికారులపై చర్యలు?


హైడ్రా సంస్థ ఈ నెలన్నర రోజులలోనే హైదరాబాద్‌ నగరంలో 18 ప్రాంతాలలో సుమారు 200కి పైగా అక్రమ కట్టడాలు కూల్చివేసింది. తద్వారా వేలకోట్లు విలువైన సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని తిరిగి ప్రభుత్వానికి అప్పగించబోతోంది. 

హైడ్రా కూల్చివేతలపై విమర్శలు, ప్రశంశలు సమానంగానే వస్తున్నాయి. ఆక్రమణదారులు వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశంశిస్తున్నారు. అయితే అక్రమ కట్టడాల కూల్చివేతతో తమ పని పూర్తవలేదని హైడ్రా అధికారులు చెపుతున్నారు.

కొందరు అధికారులు లంచాలకు ఆశపడి లేదా రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందునే అక్రమ కట్టడాలు వెలిశాయి. కనుక ఆవిదంగా అక్రమాలకు పాల్పడిన ఆరుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ కమీషనర్‌కు లేఖ వ్రాసింది.

గతంలో బఫర్ జోన్‌లో పనిచేసిన జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, జలవనరులు, హెచ్ఎండీఏ అధికారుల వివరాలను హైడ్రా సేకరిస్తోంది. కనుక రాబోయే రోజుల్లో పలువురు అధికారులపై  చర్యలు తీసుకునే అవకాశం ఉంది.