తమ్ముడు తమ్ముడే... హైడ్రా హైడ్రాయే...

మాదాపూర్‌లో అమర్ సొసైటీలో నివాసం ఉంటున్న సిఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు బఫర్ జోన్‌లో ఉన్నందున దానిని కూల్చేస్తామని హైడ్రా సిబ్బంది నోటీస్‌ ఇచ్చి వెళ్ళారు.

సిఎం రేవంత్‌ రెడ్డి సొంత అన్న ఇల్లు కూల్చేస్తామని  హైడ్రా నోటీస్‌ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ బిఆర్ఎస్ రాజకీయాల వలననే నోటీస్‌ ఇచ్చారని తిరుపతి రెడ్డి ఆరోపించారు. తాను అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ ఇల్లు కొన్నానని కానీ ఇప్పుడు తన ఇల్లు దుర్గం చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉందని చెపుతూ నోటీస్‌ ఇచ్చారని అన్నారు. 

తాను ముఖ్యమంత్రి సోదరుడినే కావచ్చు. కానీ అందరికీ వర్తించే నియమ నియమ నిబంధనలు, చట్టాలే నాకు వర్తిస్తాయన్నారు. కనుక తనకు కొంచెం సమయం ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానని తిరుపతి రెడ్డి అన్నారు.

బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా అవినీతి, అక్రమాలు జరిగాయని వాటిని కప్పి పుచ్చుకునేందుకే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఒకవేళ నేను ఇక్కడ ఉండకపోయి ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కారు. కానీ ఇప్పుడు నా వలన సొసైటీలో మిగిలినవారు ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు.