రేవంత్‌ రెడ్డి సోదరుడికి కూడా హైడ్రా నోటీస్‌!

సిఎం రేవంత్‌ రెడ్డి నిన్న సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నాతో సహా నా కుటుంబసభ్యులు ఎవరైనా ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ నిబందనలకు విరుద్దంగా ఇళ్ళు నిర్మించుకున్నట్లు బిఆర్ఎస్ నేతలు నిరూపిస్తే వాటిని తానే దగ్గరుండి కూల్పించేస్తానన్నారు. 

రేవంత్‌ రెడ్డి తెలిసే అన్నారో తెలియక అన్నారో కానీ సరిగ్గా అదే జరిగింది. ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న ఇల్లు బఫర్ జోన్‌ పరిధిలో ఉందంటూ హైడ్రా అధికారులు గుర్తించి, ఇల్లు కూల్చివేస్తామంటూ నోటీస్‌ జారీ చేశారు. 

దీనిపై సిఎం రేవంత్‌ రెడ్డి దీనిపై ఇంకా స్పందించలేదు. కానీ ఇప్పుడు వెనక్కు తగ్గలేని పరిస్థితి నెలకొంది. కనుక చెప్పిన్నట్లుగానే స్వయంగా దగ్గరుండి సోదరుడి ఇల్లు కూల్పించక తప్పదు. అయితే హైడ్రా కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపులే అని వాదిస్తున్న మజ్లీస్‌, బిఆర్ఎస్ పార్టీల వాదనలు దీంతో చెక్ పెట్టవచ్చు. ఆ తర్వాత  కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సిఎం రేవంత్‌ రెడ్డిని ఎవరూ విమర్శించలేరు. 

హైడ్రా అధికారులు దుర్గం చెరువు ఆక్రమణలపై కూడా దృష్టి సారించి దానిని ఆనుకొని ఉన్న కావూరి హిల్స్, డాక్టర్స్ కాలనీ, నెక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీవాసులకు బుధవారం నోటీసులు జారీ చేశారు. 

వారి ఇళ్ళన్నీ ఎఫ్‌టిఎల్ నిబంధనలకు విరుదంగా బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని, కనుక తామంతట తామే ఇళ్ళు కూల్చేసుకొని ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని లేకుంటే హైడ్రా కూల్చివేస్తుందని, ఆ కూల్చివేత, శిధిలాల తరలింపు ఖర్చుకు కూడా ఇళ్ళ యజమానులే చెల్లించాలని ఆ నోటేసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.