ఏపి సి.ఎం. చంద్రబాబుని నిత్యం ఏదో వంకతో విమర్శిస్తూ చాల హడావుడి చేసే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన చేసిన మరుసటి రోజు నుంచి కనిపించుట లేదు. శనివారం లోటస్ పాండ్ లో జగన్ అధ్యక్షతన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిందని సాక్షి మీడియా తెలిపింది. కానీ ఆ సమావేశంలో జగన్ మాట్లాడుతున్నట్లు ఎక్కడా చూపించలేదు. ఒకవేళ ఆ సమావేశంలో జగన్ పాల్గొని ఉండి ఉంటే సాక్షి మీడియా ఆయనని చూపించకుండా ఉండదు. సమావేశం అనంతరం ఆ పార్టీ నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియా (సాక్షి) తో ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. కానీ ప్రత్యేక హోదా గురించి గొంతు చించుకొని చాలా ఆవేశంగా మాట్లాడే జగన్ మాత్రం కనిపించలేదు.
ప్రతీ చిన్న అంశంపై మీడియా ముందుకు వచ్చి దానిని ఏదో విధంగా చంద్రబాబుతో ముడిపెట్టి నిందించే జగన్, దేశంలో ప్రకంపనాలు సృష్టిస్తున్న నోట్ల రద్దు గురించి మాట్లాడేందుకు ఇంతవరకు మీడియా ముందుకు రాకపోవడం గమనిస్తే, ఆయన చాలా పెద్ద కష్టాలలో ఉన్నారనే అనుమానం కలుగుతోంది. ఇడుపులపాయ, బెంగళూరు భవనాలలో జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు నల్లధనం దాచి ఉంచారని తెదేపా నేతలు ఆరోపిస్తుంటారు. ఒకవేళ వారి ఆరోపణలు నిజమైతే జగన్మోహన్ రెడ్డికి కేంద్రప్రభుత్వం నిర్ణయం కోలుకోలేని పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు. ఆ దిగులుతోనే ఆయన మీడియాకి మొహం చాటేస్తున్నారేమో? ఏమో?