ఏపీ శాసనసభ ఎన్నికలలో పవన్ కళ్యాణ్‌కి మద్దతు ఇవ్వకపోగా నంద్యాలలో తన స్నేహితుడు వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధికి మద్దతు ఇచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్‌పై టిడిపి, జనసేనలు గుర్రుగా ఉన్నాయి.
తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలలో అల్లు అర్జున్ పాల్గొన్నప్పుడు ‘నాకు ఇష్టమైన వారి కోసం ఎంత దూరమైనా వెల్తా.... ఇష్టం లేకపోతే రానంటూ’ చేసిన వ్యాఖ్యలపై టిడిపి, జనసేనలు మండిపడుతున్నాయి. అవి తన నంద్యాల పర్యటనని సమర్ధించుకున్నట్లే ఉన్నాయని భావించడమే ఇందుకు కారణం.
దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, వారి పేరుతో అనేకమంది ఇతరులు కూడా అల్లు అర్జున్‌ని ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది చూసి తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బి. శ్రీనివాస్ కూడా నోటికి పని చెపుతూ, “అసలు అల్లు అర్జున్ హీరో కానేకాడు. ఓ బఫూన్ మాత్రమే,’’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ చివాట్లు పెట్టారో ఏమో, ఆ ట్వీట్ చెరిపేసి అల్లు అర్జున్ నాకు, మా పార్టీకి, మా ప్రభుత్వానికి ఎవరికీ శత్రువు కారు. ఆరోజు ఆయన మాట్లాడిన దానికి నేను జవాబు చెప్పాను. అంతటితో ఈ కధ సరి. ఇక ఆ విషయం గురించి మాట్లాడవలసిన అవసరం లేదు,” అని అన్నారు.