ఆక్రమణ అని నిరూపిస్తే నా ఇంటిని కూల్చుకోవడానికి సిద్దం!

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఈరోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్‌కి మాత్రమే పరిమితం. నగరంలో చెరువులు, పార్కులు, నాలాలు చాలా కబ్జా అయ్యాయి. వాటన్నిటినీ విడిపించి మళ్ళీ పునరుద్దరించి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకే హైడ్రాని ఏర్పాటు చేశాము తప్ప ఎవరి మీదో రాజకీయ కక్ష సాధించడానికి కాదు.

హైడ్రా మొట్టమొదట మా పార్టీ సీనియర్ నేత పల్లంరాజు ఇంటినే కూల్చివేసింది. కనుక పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా కూల్చివేతలు జరుగుతాయి. జన్వాడ ఫామ్‌హౌస్‌ తనది కానప్పుడు కేటీఆర్‌ ఎందుకు టెన్షన్ పడుతున్నారు?

దానిని కేటీఆర్‌ లీజుకి తీసుకున్నానని వాదిస్తున్నారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నిర్మించిన ఆ ఫామ్‌హౌస్‌ని లీజుకి ఎలా తీసుకున్నారు? పదేళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కి ఫామ్‌హౌస్‌ నిర్మాణానికి సర్పంచ్‌ కాదు అధికారులు అనుమతిస్తారనే విషయం తెలియడంటే నమ్మశక్యంగా లేదు. మీరు లీజుకి తీసుకున్న ఫామ్‌హౌస్‌లో నివాసం ఉంటున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 

నేను కేటీఆర్‌, బిఆర్ఎస్ నేతలకి సవాలు విసురుతున్నాను. నేను, నా కుటుంబ సభ్యులు ఎవరైనా నిబందనలకు విరుద్దంగా ఇళ్ళు నిర్మించుకున్నామని నిరూపించండి. నేనే దగ్గరుండి వాటిని కూల్పించేస్తాను.

అక్రమ కట్టడాలు 25-30 ఏళ్ళనాటివి కనుక వాటిని ఉపేక్షించాలంటే కుదరదు. అక్రమ కట్టడం ఎప్పటికీ అక్రమ కట్టడమే. ఎంత పాతదైనా కూల్చేస్తాము. చెరువులు, నాలాలను కాపాడటమే మా ప్రభుత్వం లక్ష్యం, హరీష్ రావు సిద్దమైతే ఆయన నేతృత్వంలోనే చెరువులలో ఆక్రమణలపై నిజ నిర్ధారణ కమిటీ వేసేందుకు మేము సిద్దం,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.