మల్లారెడ్డి కాలేజీలకు హైడ్రా నోటీసులు జారీ!

ఊహించిన్నట్లే హైడ్రా అధికారులు మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్రమ కట్టడాలపై దృష్టి సారించారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన దుండిగల్‌లోని రెండు ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. 

ఎంఎల్ఆర్ ఐటి కాలేజి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలను చిన్న దామెర చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించినందున వాటిని కూల్చివేయబోతున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం అక్కడ వేలమంది విద్యార్దులు చదువుకుంటున్నందున, ఆ రెండు కాలేజీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు కొంత సమయం ఇస్తామని హైడ్రా కమీషనర్‌గా ఏవీ రంగనాధ్ తెలిపారు. 

మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీలు తమ ఫాతిమా కాలేజీ భవనాల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించడంపై రంగనాధ్ స్పందిస్తూ, “మాకు రాజకీయాలతో సంబంధం లేదు. అక్రమణలకు పాల్పడినవారు ఏ పార్టీకి చెందినవారైనా మేము పట్టించుకోబోము. ఆక్రమణలకు పాల్పడిన్నట్లు గుర్తిస్తే ఏమాత్రం సంకోచించకుండా కూల్చివేస్తాము. అయితే కాలేజీలలో విద్యార్ధుల భవిష్యత్‌ దృష్టిలో ఉంచుకొని వాటికి కొంచెం సమయం ఇస్తాము తప్ప ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు,” అని అన్నారు. 

జన్వాడలో కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌గా చెప్పబడుతున్న భవనం వద్దకు నేడు హైడ్రా అధికారులు, సిబ్బంది వెళ్ళి కొలతలు తీసుకుంటుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దాని యజమానిగా చెప్పుకుంటున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టులో కేసు వేసి ఫామ్‌హౌస్‌ కూల్చివేయకుండా స్టే మంజూరు చేయాలని కోరగా హైకోర్టు నిరాకరించింది. అయితే నియమ నిబందనలు ప్రకారమే ముందుకు సాగాలని హైడ్రాని ఆదేశించింది. కనుక నేడో రేపో జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.