సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకి నేడు సిఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. సచివాలయంలో ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుచేయాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో అక్కడే ఈరోజు ఉదయం 11 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టిన రోజునాడు వీలైతే ఆమె చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు.
సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పగా, దానిని తాము అధికారంలోకి రాగానే తొలగిస్తామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కనుక తెలంగాణ తల్లి విగ్రహం ఒక్కటే ఏర్పాటు చేస్తారా లేదా రాజీవ్ గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తారా? అనేది నేడు తెలియవచ్చు.