ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలలుగా తిహార్ జైల్లో మగ్గిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, నిన్న రాత్రి 9 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చారు.
ఆమె భర్త అనిల్, కొడుకు ఆదిత్య, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, పలువురు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చూసి ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారు కూడా ఆమెను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జైలు బయట ఆమె కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆమె బయటకు రాగానే బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా 18 ఏళ్ళ రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. కానీ ఓ తల్లిగా నా పిల్లలని వదిలి 5 నెలలు జైలులో గడపాల్సి రావడం నాకు, నా కుటుంబ సభ్యులకి చాలా బాధ కలిగించింది. నేను ఏ తప్పు చేయనప్పటికీ నాపై తప్పుడు కేసు బనాయించి నన్ను జైల్లో పెట్టారు.
వారు ఏ ఉద్దేశ్యంతో జైలుకి పంపినా నేను మరింత రాటు తేలేలా చేశారని చెప్పగలను. నన్ను, నా కుటుంబ సభ్యులకి ఈవిదంగా ఇటువంటి ఇబ్బందులకు గురి చేసిన ప్రతీ ఒక్కరికీ సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం. అదేవిదంగా మా ఈ కష్ట కాలంలో మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
అనంతరం అందరూ కలిసి ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి రాత్రి అక్కడే బస చేశారు. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ఛార్జ్ షీట్‌పై విచారణ జరుగనుంది. ఆ విచారణకు హాజరైన తర్వాత అందరూ కలిసి హైదరాబాద్ బయలుదేరుతారు.