రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రిని కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ కృష్ణా నదిపై ప్రతిపాదిత కేబిల్ బ్రిడ్జ్ నిర్మించాలని విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు.
రూ.1082.56 కోట్లతో నిర్మించబోతున్న ఈ కేబిల్ బ్రిడ్జి పనులకు సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారు.
జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ చౌరస్తా నుంచి నల్గొండ వరకు 203.5 కిమీ రహదారిని జాతీయ రహదారిగా మార్చి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రతిపాదనపై అధికారులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారు.
అనంతరం జూపల్లి కృష్ణారావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తే తెలంగాణ-తిరుపతి మద్య 70-80 కిమీ దూరం తగ్గుతుంది. సుమారు గంటన్నర ప్రయాణం కలిసి వస్తుంది. అలాగే అత్యంత రద్దీగా ఉండే ఆలంపూర్-నల్గొండ రోడ్డుని జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తే వాహనాల రాకపోకలకు మరింత సులువు అవుతుంది,” అని చెప్పారు.