ప్రముఖ నటుడు నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టి కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు (స్టే) జారీ చేశారు. ఈ కేసు విచారణలో నాగార్జున తరపు న్యాయవాది పలు అంశాలు న్యాయమూర్తికి తెలియజేశారు. ఆ వివరాలు క్లుప్తంగా...
• సర్వే ప్రకారం నాగార్జున ఓ ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి దానిలో 2010-2012 మద్య కాలంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు.
• దానిపై జీహెచ్‌ఎంసీ 2014లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూల్చివేసేందుకు నోటీసులు ఇవ్వగా హైకోర్టుని ఆశ్రయించారు.
• ఒకవేళ అది చెరువు భూమి అని ప్రభుత్వం నిరూపించిన్నట్లయితే తానే స్వయంగా కూల్చివేస్తానని హామీ ఇస్తూ హైకోర్టుకి రూ.9 కోట్లు జమా చేశారు. అందుకు సమ్మతించిన హైకోర్టు కూల్చివేతపై స్టే విధించింది. కానీ అది అమలులో ఉండగానే హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసి కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారు.
• తుమ్మిడి కుంట చెరువు విస్తీర్ణానికి సంబందించి మూడు నాలుగు సర్వేలు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. వాటిలో ఏది సరైనదో నిర్ధారించుకోకుండా, నాగార్జునకు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం చట్టవిరుద్దం.