ప్రముఖ తెలుగు సినీ నటుడు నాగార్జునకి చెందిన తుమ్మిడి కుంట చెరువులో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ని హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు మద్య కూల్చివేస్తున్నారు. తుమ్మిడి కుంట చెరువులో 3.30 ఎకరాల స్థలం ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ని నిర్మించినట్లు ఆరోపణలు రావడంతో హైడ్రా సిబ్బంది ఈరోజు ఉదయమే భారీ జేసీబీలతో అక్కడకు చేరుకొని కూల్చివేత ప్రారంభించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అటువైపు ఎవరూ రాకుండా భారీగా పోలీసులను మోహరించారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై గతంలోనే అంటే కేసీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడే పిర్యాదులు రావడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది కాంపౌండ్ వాల్ కూల్చివేశారు. కానీ నాగార్జున వెంటనే సిఎం కేసీఆర్‌ని కలిసి మాట్లాడటంతో కూల్చివేతలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఎన్ని పిర్యాదులు వచ్చినా జీహెచ్‌ఎంసీ సిబ్బంది పట్టించుకోలేదు.
కానీ నగరంలో ఇటువంటి ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములని విడిపించేందుకు, నాలాలు, చెరువులని పునరుద్దరించేందుకు సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా హైడ్రా వ్యవస్థని ఏర్పాటు చేయడంతో అది ఆక్రమణలు గుర్తించి చట్ట ప్రకారం ఆక్రమణదారులకి నోటీసులు ఇచ్చి కూల్చివేస్తోంది.
నాగార్జునకి కూడా ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాతే ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ని కూల్చివేస్తుండటంతో ఆయన స్పందించలేదు.
సిఎం రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా హైడ్రా పనిచేస్తుంది. దీనిలో పురపాలక, రెవెన్యూ, మంత్రులతో పాటు నాలుగు జిల్లా ఇన్‌చార్జి మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. జీహెచ్‌ఎంసీ మేయర్, సీఎస్, డిజిపి, రెవెన్యూ, పురపాలక శాఖల కార్యదర్శులు, నాలుగు జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఐఏఎస్ అధికారి రంగనాధ్ మెంబర్ కమీషనర్‌గా ఉన్నారు. కనుక హైడ్రాపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు పనిచేయడం లేదు.
ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం ఉంటున్న జన్వాడలోని ఫామ్‌హౌస్‌ని కూడా కూల్చివేసేందుకు హైడ్రా సిద్దంగా ఉండటంతో హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.