నేను ప్రజల మనిషిని భద్రత అక్కర్లేదు!

ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పోలీసులతో భద్రత కల్పించబోతే సున్నితంగా తిరస్కరించారు. ఈరోజు సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తాను ఎప్పుడు ప్రజల మనిషేనని, నిత్యం ప్రజల మద్య ఉండే తనకు భద్రత దాని వలన ప్రజలతో గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది కనుక తనకు భద్రత అవసరం లేదని చెప్పానన్నారు. 

తనకు మంత్రి పదవిపై ఆశ, ఆలోచన రెండూ లేవని, మీడియాలో వస్తున్న ఊహాగానాలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తమ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చిన్నట్లు పలు తప్పుడు నిర్ణయాలు అమలుచేసిందని వాటన్నిటికీ సరిదిద్దడమే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద పనిగా మారిందన్నారు. వాటిలో జిల్లాల పునర్విభజన కూడా ఒకటని దీనిని తమ ప్రభుత్వం సరిచేస్తుందన్నారు. 

ఉద్యోగాలు భర్తీ చేయాలని తాను ఎంతగా పోరాడినప్పటికీ కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్ళు తాత్సారం చేసి, చివరికి అది పూర్తి చేయకుండానే దిగిపోయిందన్నారు. కనుక బిఆర్ఎస్ పార్టీకి ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదన్నారు. కానీ తమ ప్రభుత్వం జాబ్ క్యాలండర్‌ ప్రకటించి దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తోందన్నారు. 

ఎస్సీ వర్గీకరణకి అవరోధాలు తొలిగాయి కనుక త్వరలోనే దానిని అమలుచేయాలని కోరుకుంటునన్నారు. అయితే దానిలోఆర్ధిక స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకొని అమలుచేస్తే బాగుంటుందన్నారు. ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డికి తన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పక ఇస్తానని ప్రొఫెసర్ కోదండరామ్‌ చెప్పారు.