తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీ కార్యాక్రమాలపై పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. అదీగాక ఆయన పదవీ కాలం కూడా పూర్తయింది. కనుక తన స్థానంలో వేరొకరిని పిసిసి అధ్యక్షుడుగా నియమించాలని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని రెండు నెలల క్రితమే కోరారు.
ఈరోజు ఢిల్లీలో అధిష్టానంతో ఇదే విషయం గురించి చర్చించిన తర్వాత సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు రేసులో మధూయాష్కీ గౌడ్, బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్ పోటీ పడ్డారు కానీ సిఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్‌కే మొగ్గు చూపడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరునే ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన చేయబోతోంది.
దీని తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. కానీ మంత్రి పదవుల కోసం పార్టీలో చాలా మంది సీనియర్లు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అందువల్ల మంత్రివర్గ విస్తరణకు తొందర పడటం లేదు. కానీ దానిపై కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఉన్నందున త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.