ఆ జర్నలిస్టులిద్దరూ పింకీలేనట అందుకే...

సిఎం రేవంత్‌ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా విలేఖరులపై రేవంత్‌ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అయితే వాళ్ళిద్దరూ కూడా గులాబీ పార్టీకి చెందినవారేనని, పంట రుణాలు మాఫీ అంశంపై వారి భర్తలు రాజకీయాలు చేస్తుంటే, వారిద్దరూ విలేఖరుల ముసుగులో అవాస్తవాలు ప్రచారం చేయడానికి, ప్రజలను, ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టడానికే వచ్చారని కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రత్యారోపణ చేశారు.     

కొండారెడ్డిపల్లికి వచ్చిన ఇద్దరు మహిళా విలేఖరులలో ఒకరైన సరిత కల్వకుంట్ల కవిత పీఆర్‌వో రాజేష్ భార్య అని, మరొకామె విజయారెడ్డి చేస్తున్న మిర్రర్ టీవీ ఛానల్ యజమాని నితిన్ రెడ్డి కూడా కేటీఆర్‌ బినామీ అని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. 

కనుక వారు మీడియా ముసుగు వేసుకొని రాజకీయాలు చేసే బదులు గులాబీ కండువాలు కప్పుకొని ఆ పార్టీలో చేరిపోతే మంచిదని ఉచిత సలహా ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళ పాలనలో పంట రుణాలు మాఫీ చేయలేకపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం 8 నెలలలోనే చేసి చూపితే సంతోషించాలి కానీ ప్రభుత్వంపై బురద జల్లడం సమంజసమా? అని ప్రశ్నించారు. మీరిద్దరూ నిజమైన, నిష్పక్షపాతంగా పనిచేసే విలేఖరులే అయితే గత పదేళ్ళలో కేసీఆర్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి ప్రశ్నించగలరా? అని సవాలు విసిరారు.