కవితకి వైరల్ ఫీవర్... మళ్ళీ ఎయిమ్స్‌కి

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో 5 నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని రోజుల క్రితమే అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. మళ్ళీ ఇవాళ్ళ అనారోగ్యానికి గురయ్యారు. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతుండటంతో జైలు అధికారులు ఆమెను, ఎయిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆమె బెయిల్‌ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు కానీ అవి తిరస్కరిస్తూనే ఉన్నాయి. ఈ నెల 20న ఆమె బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి 27కి వాయిదా వేసింది. కనీసం అంతవరకు మద్యంతర బెయిల్‌ మంజూరు చేయాలనే ఆమె న్యాయవాది విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఆమె బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 27న సీబీఐ, ఈడీలు తమ వాదనలు వినిపిస్తాయి. అవి ఆమెకు బెయిల్‌ ఇవ్వద్దనే వాదిస్తున్నాయి. కనుక ఈసారి కూడా అలాగే వాదించవచ్చు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ పూర్తయ్యేవరకు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉంచేందుకు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు కనుక 27న లేదా తదుపరి వాయిదాలో కల్వకుంట్ల కవితకి బెయిల్‌ మంజూరు చేసే అవకాశం ఉంది.