పంట రుణాలు మాఫీ గురించి ఆరా తీసేందుకు మహిళా జర్నలిస్టులు సరిత, విజయా రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి అనుచరులు వారిపై దాడి చేసి, కెమెరాలు లాక్కొని ఇబ్బంది పెట్టారు.
ఈ ఘటనపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “కొండారెడ్డిపల్లి నిషేదిత ప్రాంతమా? అక్కడకి ఎవరూ వెళ్ళకూడదా?” అని ప్రశ్నించారు.
ఇదే అంశంపై ట్విట్టర్లో స్పందిస్తూ “రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణం.
ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా? రుణమాఫీ సరిగా జరిగి ఉంటే.. సీఎంకు అంత భయమెందుకు? విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య.
వెంటనే కాంగ్రెస్ గుండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలి @TelanganaDGP. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలి,” అని ట్వీట్ చేశారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవిదంగానే జరుగుతుండేది. అందుకే ప్రజలు కేసీఆర్‌ని వద్దనుకొని రేవంత్ రెడ్డికి అధికారం అప్పగించారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఈవిదంగా జరిగితే ప్రజలుఏమనుకుంటారు? అని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే మంచిది.
బిఆర్ఎస్ పార్టీని, కేటీఆర్‌పై ఎదురుదాడి చేసి తిప్పికొట్టే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వమే ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులని కొండారెడ్డిపల్లిలో స్వేచ్ఛగా పర్యటించేందుకు ఏర్పాటు చేస్తే ఇంకా హుందాగా ఉంటుంది.