“మొన్న రాజీవ్ విగ్రహం గురించి లొల్లి... ఇప్పుడు జన్వాడ ఫామ్‌హౌస్ గురించి కేటీఆర్ లొల్లి... దేనికి?” అని అడిగారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.
గాంధీ భవన్లో విలేఖరులతో మాట్లాడుతూ, “ఆ ఫామ్‌హౌస్ తనది కాదని చెపుతున్నప్పుడు మళ్ళీ దాని గురించి అంత ఆరాటం దేనికి? ప్రదీప్ రెడ్డి చేత హైకోర్టులో ముందుగానే పిటిషన్ వేయించడం దేనికి? జన్వాడ ఫామ్‌హౌస్ ఖచ్చితంగా కేటీఆర్‌దే. అందుకే గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అక్కడికి వెళితే ఆయనపై కేసు నమోదు చేయించి జైల్లో కూడా పెట్టారు కదా? అప్పుడే రేవంత్ రెడ్డి ఎన్జీటీకి దాని గురించి ఫిర్యాదు చేశారు కూడా.
ఆ ఫామ్‌హౌస్ నాది కాదు నా స్నేహితుడు ప్రదీప్ రెడ్డిదని మీరు ఎందుకు వాదిస్తున్నారు? తన ఫామ్‌హౌస్ గురించి ఆయనే చెప్పుకోవచ్చు కదా?జన్వాడలో కేటీఆర్ సతీమణి నీలిమ, కుటుంబ సభ్యుల పేరిట భూములు ఉన్న మాట వాస్తవం కాదా? కాదంటే చెప్పండి.. ప్రభుత్వం వద్ద వారి రికార్డులన్నీ ఉన్నాయి. సర్వే నెంబర్లతో సహా అన్ని బయటపెడతాము,” అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.