కోలీవుడ్ నటుడు విజయ్ నేడు చెన్నైలోని తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు రంగులలో ఇరువైపులా రెండు ఏనుగులతో కూడిన జెండాని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశ్యించి విజయ్ మాట్లాడుతూ, “మన పార్టీ కులమత ప్రాంతీయ బేధాలు, లింగ వివక్షకు అతీతంగా అందరినీ కలుపుకుని అందరి కోసం పనిచేస్తుంది.
సమాజంలో అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. 2026లో జరుగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో మన పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది,” అని ప్రకటించారు.
తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, ఆయన వారసురాలిగా జయలలిత, ఆ తర్వాత కెప్టెన్ విజయ కాంత్, ఆ తర్వాత కమల్ హాసన్ తదితరులు సినీ పరిశ్రమ నుంచి రాజకీయ ప్రవేశం చేసినవారే.
తమిళనాడుకి 5 సార్లు ముఖ్యమంత్రి చేసిన డీఎంకె అధినేత కరుణానిధి కూడా సినీ, సాహిత్య రంగాల నేపధ్యం ఉన్నవారే. ఇప్పుడు దళపతి విజయ్ కూడా రాజకీయాలలో తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్దం అవుతున్నారు.