రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని జన్వాడలో బిఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌ని హైడ్రా అధికారులు కూల్చేయకుండా స్టే ఆర్డర్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసుపై మళ్ళీ రేపు విచారణ కొనసాగుతుంది కనుక అంతవరకు ఫామ్‌హౌస్ కూల్చివేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
అయితే ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో 15-20 ఏళ్ళ క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకొని, అవసరమైన అనుమతులు తీసుకొని నిర్మించుకున్న భవనాలను ఇప్పుడు హటాత్తుగా ఎందుకు కూల్చివేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ హైడ్రాకి చట్టబద్దత ఉందా? దాని అధికారాలు, బాధ్యతలు, పరిమితుల గురించి అడిగింది. ఇప్పటి వరకు హైడ్రా అధ్వర్యంలో జరిగిన కూల్చివేతలన్నీ అక్రమ కట్టడాలేనని నిర్ధారించుకున్నారా? నియమ నిబందనలు పటిస్తున్నారా లేదా? అని ప్రశ్నలు వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, “గత 10 ఏళ్ళుగా నగరంలో చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం హైడ్రా అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థని ఏర్పాటు చేసిందని చెప్పారు. నియమ నిబందనల ప్రకారమే హైడ్రా కూల్చేవేతలు చేపడుతోందని చెప్పారు. ఎఫ్‌టిఎల్ పరిధిపై ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయం తీసుకుందని, దీనికి సంబందించి పూర్తి వివరాలు రాగానే హైకోర్టుకి సమర్పిస్తానని చెప్పారు.