బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా భూకబ్జాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని జన్వాడలో బిఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి నిర్మించుకున్న ఫామ్‌హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. కనుక హైడ్రా అధికారులు దానిని కూల్చేయవచ్చని భావించిన ఆయన ముందుగానే హైకోర్టుని ఆశ్రయించి దానిని కూల్చవద్దని హైడ్రాకు ఆదేశం జారీ చేయాలని కోరారు.
అది కేటీఆర్ బినామీ పేరుతో నిర్మించుకున్న ఫామ్‌హౌస్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ అది తన ఫామ్‌హౌస్ కాదని తన మిత్రుడైన ప్రదీప్ రెడ్డిదని వాదిస్తున్నారు. దానిని తాను లీజుకి తీసుకొని వినియోగించుకుంటున్నానని కేటీఆర్ చెప్పారు. ఒకవేళ అది నిబందనలకు విరుద్దంగా నిర్మించిన్నట్లు రుజువు చేస్తే తానే దగ్గరుండి దానిని కూల్పించేస్తానని కేటీఆర్ చెపుతున్నారు.
అయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్‌హౌస్‌లను కూల్చేయదలిస్తే ముందుగా సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ గౌడ్, కేవీపీ రామచంద్రరావు, మహేందర్ రెడ్డి, వివేక్ రామస్వామి వెంకట స్వామి తదితరుల ఫామ్‌హౌస్‌లను ముందుగా కూల్చివేయాలని కేటీఆర్ వాదించారు.
ప్రస్తుతం జన్వాడలో కేటీఆర్ ఉంటున్న ఫామ్‌హౌస్ కూల్చివేత పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుపుతోంది. కూల్చివేతలు మొదలుపెడితే ఇటువంటి న్యాయవివాదాలు మొదలవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు కూడా తెలుసు. కనుక చట్ట ప్రకారం అన్నీ సరిచూసుకునే ముందుకు సాగడం ఖాయం.
కనుక హైడ్రా బిఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు వంటిదే అని చెప్పవచ్చు. ఈ ధాటికి బిఆర్ఎస్ నేతల భవనాలే కూలుతాయో లేదా కూల్చివేతల భయంతో బిఆర్ఎస్ పార్టీని వారే కూల్చేస్తారో?