హైదరాబాద్ నగరంలో విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడేందుకు, వాటిలో ఆక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ అనే కొత్త సంస్థని ఏర్పాటుచేసి దానికి సర్వాధికారాలు కట్టబెట్టింది.
అప్పటి నుంచి హైడ్రా అధికారులు ఏమాత్రం సంకోచించకుండా అధికార, ప్రతిపక్షాల నేతలకు సంబందించిన అక్రమ కట్టడాలను కూడా వదలకుండా కూల్చివేస్తున్నారు.
ఇటీవల ఓ సీనియర్ కాంగ్రెస్ నేతకు చెందిన భవనాన్ని కూడా కూల్చివేశారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ‘హైడ్రా’ని ఏర్పాటు చేశారు కనుక కూల్చివేతలపై ఎవరి పిర్యాదులు పట్టించుకోవడం లేదు. దీంతో భూకబ్జాలు చేసి భవనాలు నిర్మించుకున్న ప్రతిపక్ష నేతలే కాదు అధికార పార్టీ నేతలకు కూడా గుబులు మొదలైంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని జన్వాడలో బిఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి నిర్మించుకున్న ఫామ్‌హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. కనుక హైడ్రా అధికారులు దానిని కూల్చేయవచ్చని భావించిన ఆయన ముందుగానే హైకోర్టులో పిటిషన్ వేసి దానిని కూల్చవద్దని హైడ్రాకు ఆదేశం జారీ చేయాలని కోరారు.
హైడ్రా కూల్చివేతలతో ప్రముఖ నటుడు నాగార్జున పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఖానామెట్ రెవెన్యూ మండలంలో తమ్మిడి చెరువు 29.24ఎకరాల విస్తరించి ఉండగా దానిలో అధిక భాగం కబ్జాలకు గురైంది.
నాగార్జున కూడా దానిలో 3.30 ఎకరాలు కబ్జా చేసి ‘ఎన్ కన్వెన్షన్’ నిర్మించారని 2014లోనే పిర్యాదులు వస్తే జీహెచ్‌ఎంసీ సిబ్బంది దాని కాంపౌండ్ వాల్ కూల్చివేశారు. కానీ నాగార్జున వెంటనే అప్పటి సిఎం కేసీఆర్‌ని కలిసి మాట్లాడటంతో కూల్చివేత నిలిచిపోయింది. ‘
మళ్ళీ ఇప్పుడు ‘హైడ్రా’ ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలను కూల్చివేయడం మొదలు పెట్టిన తర్వాత ‘జనం కోసం’ అనే స్వచ్ఛందసంస్థ ‘ఎన్ కన్వెన్షన్’ కబ్జా గురించి తెలియజేసి కూల్చివేయాలని దరఖాస్తు ఇచ్చింది. దాంతో పాటు గతంలో జీహెచ్‌ఎంసీ నోటీసుల కాపీలు, కూల్చివేస్తున్నప్పుడు తీసిన ఫోటోలను కూడా సదార్సు సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రాకు సమర్పించారు.
కనుక నాగార్జున మళ్ళీ సిఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడితే ఆయన కూడా ఉపేక్షిస్తారా లేదా? అనేది త్వరలో తెలుస్తుంది.