కవితకు బీజేపీ కాదు కాంగ్రెస్‌ బెయిల్‌ ఇప్పిస్తుంది!

బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనమవుతోందని ఒకవేళ కుదరకపోతే ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోబోతున్నాయని సిఎం రేవంత్‌ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. మీడియాలో వస్తున్న విలీన వార్తలను కేటీఆర్‌ ఖండించకపోవడంతో అటువంటిదేదో జరుగబోతోందని వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలను, కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను కేటీఆర్‌, హరీష్ రావు ఖండించడం లేదు కానీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పదేపదే ఖండిస్తుండటం విశేషం. 

ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కల్వకుంట్ల కవితకి బీజేపీ బెయిల్‌ ఇప్పిస్తుందని రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు వాదిస్తున్నారు. కానీ ఆమెకు మా పార్టీ కాదు... కాంగ్రెస్ పార్టీయే బెయిల్‌ ఇప్పించేందుకు గట్టిగా కృషి చేస్తోంది. 

ఆ పార్టీ సీనియర్ నేత, దేశంలో ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాడిస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభ సీటు ఇస్తున్నారు.

ఆయనేదో తెలంగాణ కోసం పార్లమెంటులో పోరాడుతారనుకుంటే, కల్వకుంట్ల కవితకి బెయిల్‌ ఇప్పించేందుకు పోరాడుతున్నారు. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? 

బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓ దిక్కులేని పార్టీ. అటువంటి పార్టీని చేర్చుకుంటే అది మాకు భారమే అవుతుంది ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. కానీ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే... అవినీతి పార్టీలే.

రెండూ ఎలాగూ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేసుకున్నాయి కనుక కాంగ్రెస్‌లో బిఆర్ఎస్ పార్టీ విలీనం అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం బలపడుతుంది. కేసీఆర్‌పై అవినీతి కేసులన్నీ అటకెక్కిపోతాయి,” అని బండి సంజయ్‌ ఉచిత సలహా ఇచ్చారు.