సిద్ధిపేటపై దండయాత్రకు మైనంపల్లి... అవసరమా?

మూడు రోజుల క్రితం కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధిపేటలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై  అర్దరాత్రి దాడిచేయడంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని రోడ్లపై బైటాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి పోటీగా కాంగ్రెస్‌ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి సరిపోవన్నట్లు పట్టణంలో బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పోటీగా ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టాయి. ఇవాళ్ళ సిద్ధిపేటలో బిఆర్ఎస్ పార్టీ పంట రుణాలు మాఫీపై బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీగా సభకి సిద్దమవుతోంది. 

రెండు పార్టీలు భారీగా కార్యకర్తలని సిద్ధిపేటకు రప్పిస్తుండటంతో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. కనుక పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించి, ఎక్కడికకడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

సిద్దిపేటలో జరుగుతున్నది ఖచ్చితంగా రాజకీయ ఆధిపత్యపోరే అని అర్దమవుతూనే ఉంది. కనుక ఈ ఉద్రిక్తతలను తగ్గించాల్సిన బాధ్యత ఇరు పార్టీలపై ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై. 

అయితే కాంగ్రెస్‌ సీనియర్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హైదరాబాద్‌ నుంచి డజన్ల కొద్దీ కార్లు, అనుచరులను వెంటబెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం సిద్ధిపేటకు బయలుదేరారు. దీంతో సిద్ధిపేట రణరంగంగా మారే ప్రమాదం ఉందని చెప్పవచ్చు. అదే జరిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. 

కనుక మైనంపల్లి సిఎం రేవంత్‌ రెడ్డికి చెప్పే బయలుదేరుతున్నారో లేక తనంతట తాను బయలుదేరుతున్నారో?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.