కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశే

లిక్కర్ స్కామ్‌ కేసులో గత 5 నెలలుగా ఢిల్లీ, తీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు కూడా మళ్ళీ నిరాశ తప్పలేదు. నేడు ఆమె రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుని ఆగస్ట్ 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది కానీ ఈడీ దాఖలు చేయకపోవడంతో 27కి వాయిదా పడింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ఈ నెల 23వరకు గడువు ఇచ్చినందున ఈడీని తప్పు పట్టడానికి లేదు. 

కల్వకుంట్ల కవిత త్వరలోనే విడుదలవుతుందని కేటీఆర్‌ చెప్పారు. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ ఈ కేసు విచారణని మరో వారం రోజులకి వాయిదా వేయడంతో కేటీఆర్‌తో సహా కేటీఆర్‌ కుటుంబ సభ్యులు అందరూ తీవ్ర నిరాశ చెందారు.

నిన్న బిఆర్ఎస్‌ పార్టీలో మహిళా కార్యకర్తలు కేటీఆర్‌కి రాఖీ కడుతున్నప్పుడు ఆయన జైల్లో ఉన్న తన చెల్లి కల్వకుంట్ల కవితని తలు భావోద్వేగానికి లోనయ్యారు. ఇదివరకు ఆమె రాఖీ కడుతుండగా తీసిన పాత ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి ఆమెను గుర్తుచేసుకున్నారు. ఓ అన్నగా ఎప్పటికీ ఆమెకు అండగా నిలబడతానని దానిలో పేర్కొన్నారు.