రైతులకి గమనిక: వరి మానేస్తే ఎకరాకు రూ.7,000 నజరానా!

రైతులకి ముఖ్య గమనిక: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే ఎకరాకు రూ.7,000 చొప్పున ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఒక్కో రైతుకి గరిష్టంగా పన్నెండున్నర ఎకరాల వరకు ఈ రాయితీ పొందవచ్చు. ఈ సొమ్ముని ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తుంది. 

అయితే ఇది మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కాదు. పంజాబ్ రైతులకు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న బంపర్ ఆఫర్. మిగిలిన అన్ని పంటల కంటే వరి పంటకు నీళ్ళు చాలా ఎక్కువ కావాలి. కనుక నీటి ని పొదుపు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఈ కొత్త పధకాన్ని ప్రవేశపెట్టింది. 

భారత్‌లో వరి ఉత్పత్తి అవసరానికి మించి ఉంది. అయితే ఎక్కువ డిమాండ్ ఉన్న సన్న బియ్యం, సోనా మసూరీ, బాస్మతి బియ్యం కంటే దొడ్డు బియ్యం (రారైస్) ఎక్కువగా పండుతుంది. ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో ‘రారైస్’ విపరీతంగా పండిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ రారైస్ తీసుకోబోమని తెగేసి చెప్పడం, అప్పుడు కేసీఆర్‌ కయ్యానికి కాలుదువ్వడం అందరికీ తెలుసు. ఆ నేపధ్యంలో కేసీఆర్‌ సైతం రాష్ట్రంలో రైతులను రారైస్ వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేయాలని లేకుంటే నష్టపోతారని హెచ్చరించారు కూడా.

అయితే ఈ సమస్యని పంజాబ్ ప్రభుత్వం రైతులు సంతోషంగా ఒప్పుకునేలా ఈవిదంగా పరిష్కరిస్తుండటం చాలా అభినందనీయం.