కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతకలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమీషన్‌ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పీసి ఘోష్ హైదరాబాద్ చేరుకుని బీఆర్‌కే భవన్‌లో కమీషన్ కార్యాలయంలో నేటి నుంచి పని మొదలుపెట్టారు.
ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణ జరిపి నివేదిక తయారు చేశారు. జలవనరుల శాఖ కార్యాలయం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించిన దస్త్రాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటినీ పీసి ఘోష్ కమీషన్‌కు అప్పగించనున్నారు. వాటి ఆధారంగా సంబందిత అధికారులు, మాజీ అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థకి, చివరిగా మాజీ సిఎం కేసీఆర్, మాజీ ఆర్ధిక, సాగునీటి శాఖల మంత్రి హరీష్ రావుకు నోటీసులు పంపించి ప్రశ్నించనున్నారు.
పీసి ఘోష్ రెండు వారాలు హైదరాబాద్‌లోనే ఉండి విచారణ జరుపబోతున్నారు. అవసరమైతే స్వయంగా దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిలను పరిశీలిస్తారు.
మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు క్రుంగిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ దృష్టికి కూడా వెళ్ళడంతో వారు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు. బ్యారేజీలో నీటిని నిలువ చేస్తే పక్కనే ఉన్న పిల్లర్లపై ఒత్తిడి పెరిగి అవి క్రుంగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ గోడలు పగుళ్ళని పరిశీలించారు. కనుక కేసీఆర్ ఈ లోపాలను తేలికగా కొట్టిపడేసినంత మాత్రన్న కమీషన్ కూడా కొట్టి పడేస్తుందనుకోలేము.