హరీష్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడి

సిద్ధిపేటలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై శుక్రవారం రాత్రి కొందరు గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. వారు ‘జై కాంగ్రెస్‌’ అని నినాదాలు చేస్తూ పైకి ఎక్కి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అని వ్రాసున్న బోర్డుని ధ్వంసం చేశారు. తర్వాత తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. అర్దరాత్రి వారు ‘జై కాంగ్రెస్‌’ అంటూ నినాదాలు చేస్తూ విధ్వంసం చేస్తున్నప్పుడు అక్కడే ఓ పోలీస్ కూడా ఉన్నారు కానీ ఒక్కరే ఉండటంతో వారిని అడ్డుకోలేక చూస్తూ ఉండిపోయారు. 

ఈ దాడి ఘటనని ఎవరో మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి ఆ వీడియోని హరీష్ రావుకి పంపగా ఆయన దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

కాంగ్రెస్‌ గూండాలు సిద్దిపేటలో నా క్యాంప్ కార్యాలయంపై అర్దరాత్రి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఈ దాడి అప్రజాస్వామ్యం... తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. 

దుండగులు నా క్యాంప్ కార్యాలయంపై దాడి చేస్తుంటే వారిని అడ్డుకోవలసిన పోలీసులు వారికే రక్షణ కల్పించారు. ఓ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికే భద్రత లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం భద్రత కల్పించగలరు? పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరగడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. 

కనుక డిజిపి గారు ఈ ఘటనపై తక్షణం తగు చర్యలు చేపట్టి రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలకు తావులేదని నిరూపించగలరు,” అంటూ హరీష్ రావు ట్వీట్‌ చేశారు.