తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలో కమలాపురం వద్ద కొత్తగా నిర్మించిన పంప్ హౌస్‌ని ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన కాంగ్రెస్ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కృష్ణ జలాల కోసం నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు, వారి కోసం మా మంత్రులు ఒకరితో మరొకరు పోటీ పడే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు శాస్విత పరిష్కారంగా కృష్ణా గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాకు తీసుకురాబోతున్నాము.
రూ.18,000 కోట్ల నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుని ఏడాదిలోగా పూర్తిచేసి వచ్చే ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభోత్సవం చేసుకుందాము. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఈ గడ్డ మీద నిలబడి మీ అందరికీ మాట ఇస్తున్నాను.
ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను కేవలం రూ.1,500 కోట్లతోనే పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు. కానీ కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి రూ.18,000 కోట్ల సీతారామ ప్రాజెక్టు మొదలుపెట్టింది. దానిని మేము పూర్తిచేసి జిల్లాకు సాగునీరు అందిస్తాము.
మున్నేరు నది నుంచి గ్రావిటీ ద్వారా మరో 32 టీఎంసీలు నీళ్ళు అందిస్తాము. డోర్నకల్ నియోజకవర్గంలో వీరభద్రుడు పేరుతో 15 టీఎంసీల సామర్ధ్యం కలిగిన ఓ జలాశయం నిర్మించి నియోజకవర్గంలో నీటి సమస్యను శాస్వితంగా పరిష్కరిస్తామని మాట ఇస్తున్నాము.
రైతు సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కనుకనే గతంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న యావతో రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచేసి, హడావుడిగా నాసిరకం నిర్మాణాలు చేసి చేతులు దులుపుకుంది. అందుకే అప్పుడే ప్రాజెక్టులు దెబ్బ తింటున్నాయి. సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని నేను కేస్, కేటీఆర్, హరీష్ రావులకు సవాలు చేస్తున్నాను,” అని అన్నారు.