తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి రాగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ముందుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి తన విదేశీ పర్యటనలో సాధించిన పెట్టుబడుల గురించి వివరిస్తారు.
శాసనసభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ చేశారు. దానిలో భాగంగా రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆ హామీని అమలుచేసింది కనుక వరంగల్లో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి రాహుల్ గాంధీని ముఖ్య అతిధిగా ఆహ్వానించనున్నారు.
పిసిసి కొత్త అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉంది. వాటి గురించి కూడా నేడు కాంగ్రెస్ అధిష్టానంతో సిఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో నేడు సమావేశమవుతారు.
ఆ తర్వాత అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తదితరులను కలిసి రాష్ట్రానికి సంబందించిన అంశాలపై చర్చిస్తారు.