తెలంగాణలో మళ్ళీ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ షురూ

గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన భూముల క్రమబద్దీకరణ అపరిష్కృతంగా నిలిచిపోయింది. దాదాపు 25.70 లక్షల దరఖాస్తులు వస్తే వాటిలో చాలా వరకు పరిష్కారం కాకుండా అలాగే పడున్నాయి. ఈ సమస్యని పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది. దానిని నిలుపుకుంటూ  లే ఔట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌జగన్మోహన్‌ రెడ్డి) ప్రక్రియని మళ్ళీ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. మూడు నెలల్లోగా ఈ ప్రక్రియని పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 

రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినందున ఈ పేరుతో ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అవకతవకలు, న్యాయ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రక్రియని పూర్తిచేయాలని కోరారు.

దీని కోసం సామాన్య, మద్యతరగతి ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని కనుక వారిని దళారులు మోసం చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని మంత్రులు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.    

ఎల్ఆర్ఎస్ కోసం హెచ్ఎండీఏ పరిధిలోనే 3.58 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, ఇతర జిల్లాలలో 13.69 లక్షలు, గ్రామ పంచాయితీల పరిధిలో 6 లక్షలు, అర్బన్ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి.