తెలంగాణ శాసనసభ సమావేశాలలో నిన్న చివరి రోజున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ అభివృద్ధిపై జరిగిన చర్చలో మాట్లాడబోతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదేపదే ఆయనకు అడ్డుపడ్డారు. దాంతో సహనం కోల్పోయిన ఆయన “ఒరేయ్ బయటకు రండి ఒక్కొక్కడి తోలు తీస్తా...” అంటూ బెదిరించారు.
ఆయన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ పార్టీ నేడు గన్‌పార్క్ వద్ద ధర్నాలో ప్రస్తావించి నిరసన వ్యక్తం చేయడంతో, దానం నాగేందర్ స్పందిస్తూ, “నేను బిఆర్ఎస్ పార్టీలో పదేళ్ళు ఉన్నాను. కానీ నాకు ఏనాడూ శాసనసభలో మాట్లాడేందుకు కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత శాసనసభలో మాట్లాడుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా వారి బుద్ధి మారడం లేదు. ఏదో విదంగా శాసనసభలో గొడవ చేస్తూ సభ నడవకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు.
వారు నన్ను ఉద్దేశ్యించి బూతులు తిడుతుండటంతో నేను సహనం కోల్పోయి ఆ విదంగా మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచాలని కాదు. అయిన నేను మాట్లాడిన మాటలు తెలంగాణలో వాడుకభాషలో రోజూ అందరూ అనుకునేవే. కానీ వాటితో ఎవరినైనా నొప్పించిన్నట్లయితే క్షమాపణలు చెపుతున్నాను,” అని అన్నారు.