శాసనసభలో ఇవేం మాటలు దానం?

తెలంగాణ శాసనసభ సమావేశాలలో నిన్న చివరి రోజున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడబోతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు వ్యక్తం చేశారు. ఆయన బిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరారు కనుక వారు ఆయన సభలో మాట్లాడుతున్నప్పుడు నిరసనలు తెలిపారు.

దాంతో సహనం కోల్పోయిన దానం నాగేందర్‌ ‘రేయ్...ఏమనుకుంటున్నారు?బయటకు రండి ఒక్కొక్కరికీ తోలు తీస్తా..” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌ వారిస్తున్నప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు ఆపలేదు. దానం నాగేందర్‌ కూడా వెనక్కు తగ్గలేదు. ఆ గందరోగోళం మద్యనే దానం నాగేందర్‌ తాను చెప్పదలచుకున్న విషయాలను చెప్పి కూర్చున్నారు. 

బిఆర్ఎస్ పార్టీ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఘాటుగా స్పందిస్తూ, “అసెంబ్లీలో ఇంత సంస్కారవంతమైన భాషలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్న "పంజాగుట్ట సర్కిల్ దగ్గర బీడీలు అమ్మేటోని" మీద కూడా ఏమన్నా కేసులు పెడతారా అధ్యక్షా? (ఇది మేము అనలే.. స్వయానా మీ సభా నాయకుడే అన్నాడు. కావాలంటే వీడియో కూడా షేర్ చేస్తాం)” అని మెసేజ్ పెట్టింది.

వారం రోజులపాటు శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మద్య వివిద అంశాలపై చాలా వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. కానీ ఎవరూ హద్దు మీరలేదు. సభ గౌరవం కాపాడుతామని ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఈవిదంగా మాట్లాడటం సరికాదనే చెప్పొచ్చు.