ట్రంప్ ఎన్నికపై ఉగ్రవాది అభిప్రాయం

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవడం ప్రపంచంలో చాలా దేశాల ప్రజలకి ఇష్టం లేదనేది పెద్ద రహస్యమేమీ కాదు. చివరికి ఉగ్రవాదులు కూడా ట్రంప్ అధ్యక్షుడు కాకూడదనే కోరుకొంటున్నారని పాకిస్తాన్ లో కరుడుగట్టిన లష్కర్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ మాటలు విన్నట్లయితే అర్ధం అవుతుంది. 

ట్రంప్ ఎన్నిక గురించి అతను ఏమన్నాడంటే, “ట్రంప్ ని ఎన్నుకోవడం అమెరికన్ల జాత్యాహంకారానికి, అజ్ఞానానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనం. ట్రంప్ ని అధ్యక్షుడుగా చేసుకొని అమెరికన్ ప్రజలు కొరివితో తలగోక్కోబోతున్నారు. ట్రంప్ ఎన్నికయినంత మాత్రాన్న మనం (పాక్ ప్రజలా..ఉగ్రవాదులా?) భయపడవలసినవసరం లేదు. ముస్లిం దేశాలు అన్నీ కలిసి అమెరికాకి గుణపాఠం నేర్పించవలసిన సమయం దగ్గర పడింది,” అని అన్నాడు. 

ఒక ఉగ్రవాది అమెరికా అధ్యక్షుడి ఎన్నికపై ఈవిధంగా అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషమే. ముస్లింల పట్ల వ్యతిరేకత ప్రదర్శించిన ట్రంప్ ని అమెరికన్ ప్రజలు ఎన్నుకొన్నందునే అది జాత్యాహంకారానికి నిదర్శనమని సయీద్ భావించడం సహజమే. ‘ట్రంప్ అధ్యక్షుడు అయినా కూడా మనం భయపడనవసరం లేదు’ అనడం గమనిస్తే ఆయన వలన మున్ముందు తాము (ఉగ్రవాదులకి) చాలా గడ్డు రోజులు ఎదుర్కోవలసి రావచ్చనే భయం అతని మాటలలో కనబడుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో తాను అమెరికా అధ్యక్షుడనైతే ఐసిస్ ఉగ్రవాదులని తుడిచిపెట్టేస్తానాని, అందుకు అవసరమైతే వారి మీద అణుబాంబులు వేయడానికి కూడా వెనుకాడనని డోనాల్డ్ ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన నిజంగానే అన్నంత పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. అది ఎన్నికలలో ప్రజలని ఆకట్టుకోవడానికే ఆయన అటువంటి మాటలు మాట్లాడి ఉండవచ్చు. కానీ ఉగ్రవాదుల పట్ల ఆయన ఇదివరకటి అధ్యక్షుల కంటే కూడా చాలా కటినంగా వ్యవహరించడం మాత్రం ఖాయం. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతోందనే విషయం ఆయన అధికారం చేపట్టిన తరువాతే మెల్లమెల్లగా తెలుస్తుంది. అందుకే ఉగ్రవాదులు కూడా ట్రంప్ ని వ్యతిరేకిస్తున్నారు. ఆయనని చూసి భయపడుతున్నారని చెప్పవచ్చు.