మోడీపై క్రేజీ ఆరోపణలు

నోట్ల రద్దు నిర్ణయాన్ని బలంగా వ్యతిరేకిస్తున్న వారిలో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకరు. ఆయన అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి పోరాటం చేశారు కనుక తను నీతి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ నని, వాటిపై తనకే పేటెంట్ హక్కులు ఉన్నాయనే ధోరణిలో మాట్లాడుతుంటారు. దేశంలో తాను తప్ప మిగిలినవారందరూ అవినీతిపరులే అన్నట్లు ఉంటాయి ఆయన మాటలు. నోట్ల రద్దుపై ఆయన ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీపై మళ్ళీ తీవ్రంగా విరుచుకు పడ్డారు.

"ఆ నిర్ణయం గురించి మోడీ అనుకూల కార్పోరేట్ సంస్థల అధిపతులు అందరికీ ముందే తెలుసు. అందుకే ఇంత జరుగుతున్నా వాళ్ళలో ఏ ఒక్కరూ బ్యాంక్ ఏటిఎంల వద్ద క్యూలలో మనకి కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వం నేరుగా వాళ్ళ ఇళ్ళకే రూ.100, 2,000 నోట్ల కట్టలు పంపిస్తోంది. లేకుంటే కొంతమంది దగ్గరే వంద నోట్లు బండిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? రెండు రోజులు అవుతున్నా సామాన్యులకి ఎందుకు దొరకడం లేదు?" అని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

"మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పి పాత నోట్లు రద్దు చేసి ఇంకా పెద్ద నోట్లు ముద్రించింది. దేనికి? నల్లధనం ఇంకా పెంచడానికే! 2011లోనే మన దేశంలో 6,000 మంది ప్రముఖులు స్విస్ బ్యాంకులలో నల్లధనం చాలా బారీగా పోగేశారని చెప్పాను. వారి జాబితా తయారీలో నేను కూడా ఉన్నాను. అధికారంలోకి రాక మునుపు వారందరిపై చర్యలు తీసుకొంటానని చెప్పిన మోడీ, అధికారంలోకి వచ్చాక వారి సంగతే మరిచిపోయారు. మళ్ళీ ఇప్పుడు నల్లధనం వెలికి తీయడానికి అంటూ ఈ కొత్త నాటకం మొదలుపెట్టారు. దీని వలన సామాన్య పౌరులే ఎక్కువగా నష్టపోతున్నారు తప్ప నల్లకుభేరులు కారు. కానీ దీనితో సామాన్యులకి ఏదో మేలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ గొప్పలు చెప్పుకొంటున్నారు,” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.