ఈ ఆరు రోజులలో జరిగిన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతీ పద్దుపై బిఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా వారికి ధీటుగా సమాధానాలు చెపుతున్నారు. శాసనసభ వేదికగా బడ్జెట్‌పై ఈసారి చాలా అర్దవంతమైన చర్చలు జరుగుతున్నట్లే భావించవచ్చు.
నేడు శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ఏడవ రోజున రాష్ట్ర ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్ల విలువ గల ద్రవ్య వినిమయ బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టారు. దాంతో పాటు మరికొన్ని బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.
బడ్జెట్‌పై అధికార, ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రి భట్టి విక్రమార్క, ఆయా శాఖల మంత్రులు నేడు సమాధానాలు ఇస్తున్నారు. ఈరోజు కూడా వివిద పద్దులపై అధికార, ప్రతిపక్షాలు లోతుగా చర్చించిన తర్వాత బడ్జెట్‌కి ఆమోదం తెలుపనున్నారు.