ఛత్తీస్‌ఘడ్‌తో విద్యు కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమీషన్‌కు ఛైర్మన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్‌ని నియమితులయ్యారు.
ఇదివరకు ఈ కమీషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ నరసింహా రెడ్డి తీరుపై బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళగా ఆయన స్థానంలో వేరేవారిని నియమించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మదన్ బి. లోకూర్‌ని విద్యుత్ కమీషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ విచారణ ఆగిన చోట నుంచి ఆయన విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అనుమతించినందున అక్కడి నుంచి ఈ మూడు అంశాలపై జస్టిస్ మదన్ బి. లోకూర్ విచారణ చేపడతారు.
జస్టిస్ మదన్ బి లోకూర్ 2011-2012 మద్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012, జూన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 2018 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు.
జస్టిస్ నరసింహా రెడ్డి ఈ మూడు అంశాలపై విచారణ పూర్తి చేయక మునుపే మీడియా సమావేశంలో అవినీతి జరిగిందన్నట్లు మాట్లాడటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టడంతో ఆయన స్వచ్చందంగా కమీషన్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.