తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి నేడు శాసనసభ ఆవరణలో రెండో విడత పంట రుణాలను మాఫీ చేసేందుకు రూ.6,190 కోట్లు విడుదల చేశారు. తద్వారా లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న 6.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుంది.
మొదటి విడతలో 11.34 లక్షల మందికి రూ.6,035 నేడు విడుదల చేసినది కలిపితే రెండు విడతలలో మొత్తం 17.75 లక్షల మంది రైతులకు రూ.12,225 కోట్లు రేవంత్ సర్కార్ రుణమాఫీ చేసింది. ఆగస్ట్ మొదటి వారంలోగా మూడో విడతలో ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయబోతోంది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఇదివరకు రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆర్ధిక ఇబ్బందులను భరించలేక పురుగుల మందు త్రాగి ప్రాణాలు తీసుకునేవారు. తెలంగాణలో ఏ రైతుకీ అటువంటి కష్టం రాకూడదనే మా ప్రభుత్వం ఈ పంట రుణాల మాఫీ పధకాన్ని అమలుచేస్తోంది.
గత ప్రభుత్వంలాగా పదేళ్ళు సాగదీసి వాయిదాలలో చెల్లించడం కాకుండా ఒకేసారి ఏకమొత్తంలో చెల్లిస్తే రైతులకు మేలు కలుగుతుందని ఈవిదంగా చేస్తున్నాము. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలుచేస్తున్నాము. నేడు రెండో విడత పంట రుణాల మాఫీ మా నిబద్దతకు నిదర్శనం,” అని అన్నారు.
ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వ విధానాన్ని తప్పు పడుతూ, “మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తుంటుంది. గత పదేళ్ళలో కార్పొరేట్ కంపెనీలు సుమారు రూ.17 లక్షల కోట్లు రుణాలు చెల్లించకుండా ఎగవేస్తే, ప్రధాని నరేంద్రమోడీ చాలా ఉదార హృదయంతో వాటన్నిటినీ మాఫీ చేసేస్తున్నారు. కానీ మనకు అన్నం పెట్టే అన్నదాతకు పంట రుణాలు మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి మనసు రాదు,” అని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.