తెలంగాణ శాసనసభ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 10.30 గంటలకు బడ్జెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. కానీ బడ్జెట్ పద్దులపై అధికార, ప్రతిపక్షాల మద్య వాడివేడిగా చర్చలు సాగడంతో మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు వరకు సమావేశం కొనసాగింది. ఇదివరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు రాత్రి 10-11 గంటల వరకు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత సుదీర్గంగా సమావేశం జరగడం ఇదే తొలిసారి. కనుక శాసనసభ చరిత్రలో కొత్త రికార్డ్ నమోదయింది.
ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కాలం చెల్లిన టెక్నాలజీతో యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో అవకతవకల గురించి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు మాట్లాడగా, బిఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఇంధనశాఖ మంత్రి జగదీష్ రెడ్డి వారితో వాగ్వాదం చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “నాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విధ్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యవసరంగా ఛత్తీస్‌ఘడ్‌తో వెయ్యి మెగావాట్స్ విద్యుత్ కొనుగోలుచేశామని చెపుతున్నారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించామని సమర్ధించుకుంటున్నారు.
కానీ రాష్ట్ర విభజన సమయంలోనే జైపాల్ రెడ్డి తెలంగాణకు కేంద్ర గ్రిడ్ నుంచి 36% బదులు 53.46% విద్యుత్ సరఫరా అయ్యేలా చేశారు కదా?మరి ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నుంచి వెయ్యి మెగావాట్స్ ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
“తెలంగాణకు అత్యవసరంగా విద్యుత్ అందించేందుకే యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మింపజేస్తున్నామని చెప్పుకున్నారు. కానీ నేటికీ అవి అందుబాటులోకి రాలేదు కదా? నష్టాలలో ఉన్న గుజరాత్ కు చెందిన ఇండియా బుల్స్ కంపెనీతో లూలుచీ పడి, దానిని కాపాడేందుకే బీహెచ్ఈఎల్ సంస్థకు టెండర్లు పిలవకుండానే రెండు ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టర్లు అప్పగించేశారు.
బీహెచ్ఈఎల్ సంస్థకు సాంకేతిక పనులు తప్ప సివిల్ పనులు చేయదని మీకు ముందే తెలుసు. కనుక దానికి ఈ రెండు ప్లాంట్స్ నిర్మాణ బాధ్యతలు అప్పగించి, దాని నుంచి మీ బిఆర్ఎస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు పనులు దక్కేలా చేశారు.
రెండు ప్లాంట్ల అంచనా వ్యయం కూడా భారీగా పెంచేశారు. యాదాద్రి ప్లాంట్ నిర్మాణం ఇంకా పూర్తికానే లేదు. మరో రెండేళ్ళు పడుతుంది. అప్పటికి అంచనా వ్యయం ఇంకా పెరిగిపోతుంది. ఆ కారణంగా యూనిట్ రేటు పెంచాల్సివస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో యూనిట్ రూ.5లకు లభిస్తుండగా రూ.8-9 పెట్టి యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నుంచి ఎవరు కొంటారు?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
“జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ విచారణలో మీ అవినీతి, అక్రమాలు బయటపడితే జైలుకి వెళ్ళాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ కమీషన్ ఏర్పాటుని వ్యతిరేకించారు. హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు.
కానీ సుప్రీంకోర్టు కమీషన్-విచారణ వద్దని చెప్పలేదు. ఛైర్మన్‌ని మార్చమని మాత్రమే చెప్పింది. త్వరలోనే కొత్త ఛైర్మన్ పేరు ప్రకటిస్తాం. ఈ మూడు అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపిస్తాం,” అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.