నేడే రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు విడుదల

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా నేడు రెండు విడత పంట రుణాల మాఫీ నిధులు విడుదల చేయబోతోంది. సిఎం రేవంత్‌ రెడ్డి, డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురూ కలిసి శాసనసభ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం నిధులు విడుదల చేయనున్నారు.

 రెండో విడతలో లక్షన్నర వరకు పంట రుణాల మాఫీకి రూ.7,000 కోట్లు నిధులు విడుదల చేయబోతున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది రైతులకు రుణ విముక్తులు అవుతారు.

ఈ నెల 19వ తేదీన మొదటి విడతలో రూ.6,035 కోట్లు విడుదల చేసి లక్ష రూపాయలలో లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 

మొదటి విడత రుణ మాఫీతో రాష్ట్రంలో 10.83 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. అయితే తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలు సమర్పించడంలో ఆలస్యం అయిన వారికి రుణమాఫీ నిధులు ఇంకా అందలేదు. కనుక వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలలు, మండలాలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. సర్పంచ్‌లు, వ్యవసాయాధికారులకు కూడా రైతుల నుంచి వినతి పత్రాలు అందుతున్నాయి.    

ఇప్పుడు ఈ రెండో విడత రుణ మాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్ట్ మొదటి వారంలోగా మూడో విడతలో రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి నిధులు విడుదల చేస్తారు.