మోటర్లకు మీటర్లు: కేసీఆర్‌ హయాంలోనే సంతకాలు?

బిఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకునే వాటిలో వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం కూడా ఒకటి. మోటర్లకు మీటర్లు బిగించాలని మోడీ ప్రభుత్వం తమపై ఎంత ఒత్తిడి చేసినా లొంగలేదని చెప్పుకునేవారు. ‘తల నరుక్కుంటాను కానీ మోటర్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని కేసీఆర్‌ సగర్వంగా చెప్పుకునేవారు. 

అయితే కేసీఆర్‌ హయాంలోనే వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు 2017, జనవరి 4న కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని సిఎం రేవంత్‌ రెడ్డి బయటపెట్టారు. ఆ ఒప్పంద పత్రాలపై అప్పటి విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఉత్తర, దక్షిణ డిస్కంల తరపున వాటి సీఎండీలు గోపాలరావు, రఘుమారెడ్డి సంతకాలు చేశారని చెప్పారు. అనాడు చేసుకున్నా ఒప్పంద పత్రాల కాపీలను సిఎం రేవంత్‌ రెడ్డి శనివారం శాసనసభకు సమర్పించారు.

ఆ ఒప్పందం ప్రకారం 2017 జూలై 30లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మార్లు, ఫీడర్ల వద్ద స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2018 డిసెంబర్‌ నెలాఖరులోగా నెలకు 500 యూనిట్లు విద్యుత్ వాడే వ్యవసాయ మోటర్లకు, 2019 డిసెంబర్‌ నెలాఖరులోగా నెలకు 200 యూనిట్లు విద్యుత్ వాడే వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించాల్సి ఉంటుంది. 

కానీ మీత్రాలు బిగిస్తే ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో కేసీఆర్‌ అబద్దాలు చెప్పారన్నారు. ఆనాడు కేసీఆర్‌ హయాంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేసినందునే ఇప్పుడు దాని ప్రకారం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్స్ బిగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని లేకుంటే కేంద్రం డిస్కంలపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.  

కనుక మోటర్లకు మీటర్లు పెట్టేందుకు తాము కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని, కానీ తీవ్రంగా వ్యతిరేకించామని అబద్దాలు చెప్పామని హరీష్ రావు ఇప్పటికైనా ఒప్పుకొని శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరాలని సూచించారు.