హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రెండో దశ విస్తరణలో కోకపేటలోని నియోపోలిస్ వరకు మరో 3.3 కిమీ పొడిగించబోతున్నట్లు ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నిన్న బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
రాయదుర్గం నుంచి విప్రో జంక్షన్ మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని అమెరికా కాన్సులేట్ వరకు 8 కిమీ పొడిగించాలని మొదట అనుకున్నామని, కానీ దానిని కోకాపేట వరకు పొడిగిస్తే మరింత ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కోకాపేట వద్దే మెట్రో డిపో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఇదేవిదంగా నాగోలు నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణ, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 29 కిమీ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నామని, కానీ ఇప్పుడు మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో నిర్మించబోతున్న కొత్త హైకోర్టు వరకు అదనంగా మరో 5కిమీ పొడిగించబోతున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
ఈ రెండు మార్గాలలో కలిపి 8.3 కిమీ పెంచినందున మొత్తం నిర్మాణ వ్యయం రూ.24,042 కోట్లు అయ్యిందని చెప్పారు. ఈ మార్పులను పరిగణనలోకి తీసుకునే బడ్జెట్‌లో వాటికి అనుగుణంగా కేటాయింపులు జరిపిన్నట్లు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తాజా బడ్జెట్‌లో మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది.