రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,336 కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, అధికార కాంగ్రెస్‌, విపక్ష బిఆర్ఎస్ పార్టీలు శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేసి తీర్మానం కూడా చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించింది. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,336 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 

సమైక్య రాష్ట్రంలో రైల్వేశాఖ ఏడాదికి రూ.886 కోట్లు సగటున కేటాయించేదని కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే దానికి సుమారు ఆరు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయిస్తూ పలు రైల్వే ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. 

ప్రస్తుతం తెలంగాణలో రూ.32,946 కోట్లు విలువైన రైల్వే ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో 437 రైల్వే వంతెనలు, అండర్ పాసులు నిర్మించామని తెలిపారు. 

హైదరాబాద్‌ ఓఆర్ఆర్‌కు సమాంతరంగా నగరం చుట్టూ ఓ రింగ్ రైల్ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నట్లు చెప్పారు. ఎంఎంటిఎస్ పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని త్వరలో ఆ పనులు మొదలవుతాయని చెప్పారు.

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని, దాని నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కనుక తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వాదించడం సరికాదన్నారు.