ఇదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్ఎండీఏ వేలంపాటలో కోకాపేట భూములు ఎకరం రూ.101 కోట్లు వరకు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత కేసీఆర్ కోకాపేటలో బిఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాలు ఎకరం రూ.3.42 కోట్లు చొప్పున కట్టబెట్టేశారు. దానిపై ప్రతిపక్షాలు ఎంతగా అభ్యంతరాలు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు.
కానీ గండిపేట మండలంలోని సర్వే నంబర్ 240 కింద గల ఆ భూమి తమదని, దానిని గత ప్రభుత్వం అన్యాయంగా తమ పార్టీకి కట్టబెట్టేసిందంటూ హైదర్ బస్తీకి చెందిన జకేటి అశోక్ దత్త్ జయశ్రీ, ఆమె కుటుంబ సభ్యులు హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆ భూమి తన భర్త జకేటి అశోక్ దత్త్ ద్వారా తనకు, తన పిల్లలకు సంక్రమించిందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. దానిని విచారణకు స్వీకరించిన జస్టిస్ లక్ష్మణ్, ఆ భూమికి సంబందించి అన్ని పత్రాలు కోర్టుకి సమర్పించాలని ఆదేశించారు.
ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ బిఆర్ఎస్ పార్టీకి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమీషనర్, హైదరాబాద్ కమీషనర్, హెచ్ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, గండిపేట తహసీల్ధార్‌కి నోటీసులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణనుఆగస్ట్ 22కి వాయిదా వేశారు.