ఈసారి శాసనసభ సమావేశాలకు కేసీఆర్‌ హాజరవుతారా?

నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికరంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ సమవేశాలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది. నేటి నుంచి సుమారు పది రోజులు ఈ సమావేశాలు కొనసాగవచ్చని సమాచారం. 

ముందుగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించిన తర్వాత సభ వాయిదా పడుతుంది. తర్వాత అధికార, ప్రతిపక్ష సభ్యులు బీఏసీ సమావేశం నిర్వహించి శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? దానిలో చర్చించాల్సిన ముఖ్యాంశాలు ఏమిటి? అనే దానిపై చర్చించి ఖరారు చేస్తారు.

బుధవారం ఉదయం సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై 2024-2025 రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 

ఈసారి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తప్పకుండా హాజరయ్యి తమ ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విజ్ఞప్తి చేశారు. సభలో ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఈసారి సమావేశాలకు కేసీఆర్‌ హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నేడు తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ సమావేశమయ్యి శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని తెలియజేయనున్నారు.

పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నందున ఈసారి ఇదే అంశంపై శాసనసభ, మండలిలో వాడివేడిగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.