జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవ్వాళ్ళ అనంతపురం జిల్లా లో గుత్తిలో ఉన్న గేట్స్ కళాశాల విద్యార్ధులతో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెపుతూ “అనంతపురం జిల్లా పరిస్థితి నాకు బాగా తెలుసు. నీటి కోసం జిల్లా ప్రజలు ఎంతగా అల్లాడిపోతున్నారో కూడా నాకు తెలుసు. ఒకసారి ఒక పుట్టుగుడ్డి అయిన వృద్దురాలు మంచినీళ్ళ కోసం కన్నీళ్ళు పెట్టుకొంటే నేను సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాను. జిల్లాలో బోర్లు వేసినా ప్రయోజనం ఉండదని ఆ ప్రాంతంలో నా స్నేహితులు చెప్పారు. కానీ ఒకసారి ప్రయత్నిద్దామని అదే ప్రాంతంలో బోర్ వేయిస్తే నీళ్ళు పడ్డాయి. అంటే మనసు పెట్టి పనిచేయాలి కానీ ఏదయినా సాధ్యమే అని అర్ధం అవుతోంది. నా వంటి ఒక వ్యక్తి చేయగలిగిన పనిని చేతిలో అధికారం ఉన్న ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది? అంటే ఆశ్రద్దేనని చెప్పకతప్పదు.
నేను జిల్లాకి ఏదో చేయడానికి అధికారం అక్కర లేదు. అధికారం లేకపోయినా చేయగలను. కానీ జిల్లాకి ఏమి చేస్తానో చెప్పేముందు, ఇక్కడ కరువు ప్రాంతాలలో పాదయాత్ర చేసి సమస్యలని తెలుసుకోవాలనుకొంటున్నాను. కానీ మీ అభిమానమే నన్ను అడ్డేస్తోంది. మీరందరూ సహకరిస్తే నేను జిల్లాలో పాదయాత్ర చేస్తాను. ఆ తరువాత జిల్లాకి ఏమి చేస్తానో చెపుతాను. జిల్లాకి ముందుగా నీళ్ళు అందించడం నా మొదటి ప్రదాన్యత.
జనసేన అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో ఇప్పుడే చెప్పలేను కానీ మహిళలలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాను. తప్పు చేస్తే మీరు నా కలర్ పట్టుకొని నిలదీసి అడిగేంత ధైర్యం, అవకాశం కల్పిస్తాను.
నాకు స్కూల్లో చదువు అబ్బలేదు కానీ దేశభక్తి బాగా అబ్బింది. పుస్తకాలలో నేను చదువుకొన్న వాటికి, సమాజంలో వాస్తవంగా జరుగుతున్న వాటికీ ఎక్కడా పొంతన లేకపోవడంతో ఏమీ చేయాలో అర్ధం కాక ముడుచుకు పోయాను. ఒక్కోసారి జీవితం మీద విరక్తి కూడా కలిగేది. పెళ్ళి, సంసారం అన్నీ వదులుకొని సన్యాసం పుచ్చుకొని ఏ హిమాలయాలకో వెళ్ళిపోదామనుకొనే వాడిని కానీ ఊహించని విధంగా చాలా పెళ్ళిళ్ళు చేసుకోవలసి వచ్చింది.
సమాజంలో మంచి మార్పు రావాలనుకొంటే, ముందుగా మన ఆలోచనలలో మార్పు రావాలి. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవచ్చు అనుకొనేవారిని, మనకి ఉపయోగపడని వారిని ఎన్నికలలో తిరస్కరించగలిగితే అన్నీ మారుతాయి. నేను జిల్లాలో పాదయాత్ర చేసిన తరువాత మీరందరూ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెపుతాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.