కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇంతకాలం ఏపీని పాలించిన వైసీపి నేతలు వీరప్పన్ వారసులవంటివారే. వారి హయాంలో తిరుమల శ్రీవారిని కూడా విడిచిపెట్టకుండా దోచుకున్నారు. శ్రీవారి సొమ్ముని పక్కదారి పట్టించేసేవారు. ప్రమ పవిత్రమైన తిరుమలను రాజకీయ పునరావాసం కేంద్రంగా మార్చేశారు. వారు నీచ రాజకీయాలు చేస్తూ తిరుమల పవిత్రతకు, నిత్య పూజలకు భంగం కలిగించేవారు.
శేషాచలం అడవులలో ఎర్ర చందనాన్ని దొంగిలిస్తూ వేలకోట్లు ఆర్జించారు. ఆ సొమ్ముతోనే రాజకీయాలను శాశించాలనుకున్నారు.
చంద్రబాబు నాయుడు ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల కొండపై నెలకొన్న ఈ అరాచక పరిస్థితులను సమూలంగా ప్రక్షాళన చేయడంతో మళ్ళీ తిరుమలలో యధావిధిగా నిత్యపూజలు జరుగుతున్నాయి. సామాన్య భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము.
ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని అడ్డుకునేందుకు ఇదివరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ నేతలు చాలా పోరాటాలు చేశారు. కనుక ఎర్ర చందనం దొంగలను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకొని అందరిపై చర్యలు చేపడుతాము,” అని బండి సంజయ్ అన్నారు.