సోనియా గాంధీ తీవ్రవాద సంస్థ అధినేత కాదు

ప్రొఫెసర్  కోదండరామ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి ఆమెతో రహస్య అవగాహన కుదుర్చుకొన్నారని, అందుకే ఆయన కాంగ్రెస్ ఏజెంటులాగ వ్యవహరిస్తూ తెరాస సర్కార్ పై బురద జల్లుతున్నారని తెరాస ఎంపి బాల్క సుమన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని ఆయన గట్టిగా ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కూడా వాటిపై చాలా తీవ్రంగా స్పందించారు.

 “సోనియా గాంధీ తీవ్రవాద సంస్థ అధినేత కాదు..ఒక జాతీయ పార్టీ అధినేత. కనుక ఆమెని ఎవరైనా కలుసుకోవడం నేరం కాదు..కనుక ఒకవేళ ప్రొఫెసర్  కోదండరామ్ ఆమెని కలుసుకొని ఉంటే అదేమీ నేరం కాదు. కానీ ఆమె ఒక తీవ్రవాద సంస్థ అధినేత అన్నట్లు, ఆమెని కలుసుకోవడం నేరం అన్నట్లు తెరాస ఎంపి బాల్క సుమన్ మాట్లాడుతున్నారు. ఆ మాట కొస్తే రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆమెతో ఫోటో దిగలేదా?” అని ప్రశ్నించారు మల్లు రవి.

మల్లు రవి చెప్పిన మాటలు నిజమని అందరికీ తెలుసు. ప్రొఫెసర్  కోదండరామ్ తెరాస సర్కార్ లోపాలని ఎత్తి చూపిస్తూ, దానిని విమర్శిస్తున్న కారణంగా అది తీవ్ర అసహనానికి లోనవడం సహజమే. అందుకే బాల్క సుమన్ ద్వారా ఆయనపై ఈవిధమైన ఆరోపణలు చేయిస్తున్నట్లు భావించవచ్చు. కానీ వాస్తవానికి ఆయన అన్ని రాజకీయ పార్టీలకి సమానదూరం పాటిస్తున్నారని అందరికీ తెలుసు. ఆయనకి రాజకీయాలపై, పదవులు, అధికారంపై ఏ మాత్రం మమకారం లేదని తెరాస తో సహా అందరికీ తెలుసు. కానీ అయన చేస్తున్న పోరాటాల వలన తెరాస సర్కార్ కి చాలా ఇబ్బంది కలుగుతోంది. వాటి వలన తెరాస సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే ప్రమాదం కూడా ఉంది. శంఖంలో పోస్తే గానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లుగా ప్రొఫెసర్  కోదండరామ్ పై ఏదో ఒక పార్టీ ముద్ర వేయకుండా ఎదురుదాడి చేస్తే రాష్ట్ర ప్రజలలో తమపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని తెరాస గ్రహించబట్టే ఆయనపై కాంగ్రెస్ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు. ఒకవేళ ఆయనపై తెదేపా ముద్ర వేయగలిగి ఉండి ఉంటే ఇంకా సంతోషించి ఉండేది. కానీ ఆయన అచ్చమైన తెలంగాణావాది కనుక అది సాధ్యం కాకనే ఆయనని గట్టిగా ఎదుర్కోవడానికి వీలుగా ఆయనపై కాంగ్రెస్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.